ఏపీలో గత ఎన్నికల పరాజయం మర్చిపోకముందే పిఠాపురం నియోజకవర్గంలో వైసీపీకి మరో ఎదురుదెబ్బ తప్పేలా లేదు. ఇప్పటికే పిఠాపురంలో పవన్ కళ్యాణ్ పై పోటీకి వంగా గీతను దింపి చేతులు కాల్చుకున్న వైసీపీకి.. ఇప్పుడు ఆ నిర్ణయంతో నష్టపోయిన మాజీ ఎమ్మెల్యే కూడా గుడ్ బై చెప్పేందుకు సిద్దమవుతున్నారు. ఇప్పటికే జనసేన నేతలతో ఆయన చర్చలు జరుపుతున్నట్లు తెలుస్తోంది. త్వరలో కీలక నిర్ణయం వెలువడనుంది.
గత ఎన్నికలకు ముందు పిఠాపురంలో వైసీపీ ఎమ్మెల్యేగా ఉన్న పెండెం దొరబాబును కాదని జగన్ .. పవన్ కళ్యాణ్ పై పోటీకి కాకినాడ ఎంపీగా ఉన్న వంగా గీతను తెచ్చి నిలబెట్టారు. అయితే పవన్ కళ్యాణ్ హవాలో వీరిద్దరిలో ఎవరు పోటీ చేసినా ఓడిపోయే పరిస్ధితి. కానీ సిట్టింగ్ అయిన తనను కాదని కాకినాడ ఎంపీ అయిన వంగా గీతను తీసుకొచ్చి పిఠాపురంలో పోటీ చేయించడంతో ఎన్నికల్లోనూ ఆమెకు దొరబాబు సహకరించలేదని తెలుస్తోంది. ఇప్పుడు ఏకంగా ఆయన పార్టీ మారేందుకు సిద్ధమవుతున్నారు.